Tuesday, 13 November 2018

రూ.3లక్షలకు శిశువు అమ్మకం..వ్యక్తి అరెస్ట్

Gnews telugu channel: మంచిర్యాల జిల్లా కేంద్రంలో శిశువును విక్రయించిన కేసును పోలీసులు చేధించారు. ఆ పిల్లాడిని తల్లివద్దకు చేర్చారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మారుతీనగర్‌కు చెందిన పర్వీన్ బేగం (22) అనే మహిళ గత నెల 20వ తేదీన ప్రైవేటు దవాఖానలో మగశిశువుకు జన్మనిచ్చింది. భర్త, తల్లిదండ్రులు సమయానికి దగ్గర లేకపోవటంతో, ఇంటి పక్కనే ఉన్న పత్తి సత్తమ్మ తోడుగా వెళ్లి దవాఖానలో చేర్పించింది.
ఈమె పుట్టిన బాబును అమ్మేందుకు పథకం వేసింది. దానిలో భాగంగానే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన లక్ష్మి అనే మహిళ ద్వారా బాబును అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. గోదావరిఖనిలోని LB నగర్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తికి రూ. మూడు లక్షలకు శిశువును అమ్మేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ. 50 వేలను అడ్వాన్స్‌గా తీసుకున్నారు. దవాఖాన నుంచి హడావుడిగా బాబును సత్తెమ్మ ఇంటికి తీసుకెళ్లింది. దవాఖానకు ఖర్చు చాలా అయిందనీ, డబ్బులు వేరే వాళ్లు భరించారని సత్తమ్మ పర్వీన్‌ బేగమ్‌ కు చెప్పింది. అంతే కాకుండా పుట్టిన బాబు కూడా ఆరోగ్యంగా లేడనీ, బాబును శ్రీధర్‌ కు అప్పగించి మిగతా డబ్బులు తీసుకుంది. చుట్టు పక్కల వారు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న టాస్క్‌ ఫోర్స్ పోలీసులు శిశువును విక్రయించిన పత్తి సత్తెమ్మ, గాదం లక్ష్మి, శిశువును కొనుగోలు చేసిన శ్రీధర్‌ ను అదుపులోకి తీసుకున్నారు. సత్తెమ్మ దగ్గర లభ్యమైన రూ. 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) అశోక్‌కుమార్ సమక్షంలో శిశువును తల్లి పర్వీన్‌బేగమ్‌కు అప్పగించారు. ఈ టాస్క్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని రామగుండం సీపీ సత్యనారాయణ, అడిషనల్ డీజీపీ అశోక్‌కుమార్ అభినందించారు. పట్టుకున్న నిందితులను, స్వాధీనం చేసుకున్న సొమ్మును తదుపరి విచారణ కోసం మంచిర్యాల ఎస్‌హెచ్‌ఓ. సీఐ మహేశ్‌కు అప్పగించారు.

No comments:

Post a Comment