Gnews telugu channel: కరీంనగర్ పట్టణం, న్యూస్ టుడే: కన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ తల్లి తల్లడిల్లింది. పెంచి పెద్ద చేసిన కూతురు అత్తింటికి వెళ్లడంతో 52 ఏళ్లు పైబడిన ఆమె మళ్లీ మాతృత్వం కోసం ఆరాటపడింది. అందుబాటులో ఉన్న ఆధునాతన వైద్య విధానాన్ని వరంగా మలచుకుని ఐవీఎఫ్ విధానంతో సంతాన యోగాన్ని పొందింది. కరీంనగర్ లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రంలో సాధారణ ప్రసవంతో ఇద్దరు పండటి ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. తల్లితోపాటు కవలలు ఆరోగ్యంగా ఉన్నారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కారపాకకు చెందిన ఆరె సత్యనారాయణ (55), రమాదేవి (52) దంపతులు.. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. 2013లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పద్దెనిమిదేళ్ల కుమారుడు దుర్మరణం పాలయ్యాడు. కూతురు(32)కు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు దూరమవడంతో మరో బిడ్డను కనాలనే ఉద్దేశంతో దంపతులు కరీంనగర్ లోని సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానం ద్వారా చికిత్స తీసుకుని రమాదేవి గర్భం దాల్చారు. మూడు నెలలుగా రమాదేవి ఆస్పత్రిలోనే ఉండి వైద్యసేవల్ని పొందారు. శుక్రవారం ఉదయం సాధారణ ప్రసవం ద్వారా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ.. మళ్లీ బాబు పుట్టాలని ఆశించాం.. కానీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా సంతోషంగా ఉన్నామన్నారు. డాక్టర్ పద్మజ మాట్లాడుతూ.. 55 ఏళ్ల వరకు మహిళలు ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానాన్ని పొందవచ్చన్నారు.
No comments:
Post a Comment