Friday, 19 October 2018

కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు

భువనేశ్వర్‌: ఒడిశాలోని గజపతి జిల్లా లక్ష్మీపుర్‌ గ్రామంలో గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తిత్లీ తుపాన్‌ కారణంగా మరణించిన కూతురి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ కోసం ఆస్పత్రికి తరలించే క్రమంలో ఓ తండ్రి ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీపుర్‌ గ్రామానికి చెందిన ముకుంద్‌ 7 ఏళ్ల కూతురు బబిత అక్టోబర్‌ 11 వ తేదీన తిత్లీ తుపాన్‌ కారణంగా సంభవించిన వరదల్లో తప్పిపోయింది. కాగా, సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు  మహేంద్ర గిరి వద్ద కొండచరియల కింద బబిత మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ముకుంద్‌కు చేరవేశారు. అలాగే కూతురి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహిస్తేనే.. ప్రభుత్వం నుంచి అందించే పరిహారం అందుతుందని అతనికి తెలిపారు. అలాగే బబిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా.. మృతదేహాన్ని కైన్పూర్‌ ఆస్పత్రికి తీసుకురావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే.. కూతురి మృతదేహాన్ని వాహనంలో ఆస్పత్రికి తరలించడానికి డబ్బులు లేని ముకుంద్‌.. మృతదేహాన్ని ఓ సంచిలో ఉంచి దానిని భుజం వేసుకుని నడుచుకుంటూ వెళ్లాడు. దారి పోడువున చాలా మంది అతన్ని చూస్తూ ఉన్నప్పటికీ.. ఎవరు అతనికి సహాయపడలేదు. ఇలా అతను 8 కి.మీలు ప్రయాణించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి ఆటో ఏర్పాటు చేసి కైన్పూర్‌ ఆస్పత్రికి వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీనిపై ముకుంద్‌ మాట్లాడుతూ.. తన కూతురి మృతదేహాన్ని వాహనంలో తరలించడానికి డబ్బులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తుపాన్‌ కారణంగా గ్రామానికి వచ్చే దారి దెబ్బతినడంతో.. తానే భుజంపై మోసుకుంటూ వచ్చానని అన్నారు. బబిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడానికి సరైన ఏర్పాట్లు చేయని ప్రభుత్వ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
కాగా, ఈ విషయం తెలుసుకున్న గజపతి జిల్లా కలెక్టర్‌ అనుపమ్‌ షా మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తుపాన్‌ కారణంగా కూతురిని కొల్పోయిన ముకుంద్‌కు  10 లక్షల రూపాయల చెక్‌ అందజేశారు.

No comments:

Post a Comment